: 470 మందిని జీవన్మరణ సమస్య నుంచి బంధవిముక్తుల్ని చేస్తున్నా: సామూహిక హత్యాకాండకు పాల్పడ్డ ఉన్మాది స్పీకర్ కు ముందే రాసిన లేఖ
జపాన్ లో అంగవికలుర ఆశ్రమంపై దాడి చేసి 19 మందిని కత్తితో నరికి చంపిన ఉన్మాది సతోషీ ఉమత్సు, అంతకుముందే జపాన్ దిగువ సభ స్పీకర్ ను ఉద్దేశించి తాను చేయబోయే పని గురించి ఓ లేఖ రాశాడు. జీవన్మరణ పోరాటం చేస్తున్న 470 మందిని తాను బంధవిముక్తుల్ని చేస్తున్నానని చెప్పాడు. తాను ఎందుకు దాడి చేయాలనుకుంటున్నదీ వివరించాడు. తాను చేస్తున్న పని తప్పని తెలుసునని, అయినా, ప్రజా క్షేమం, జాతి ఆర్థిక వ్యవస్థ కోసం ఈ పని చేస్తున్నానని, తాను చేసే పని బాధితులందరికీ మేలు కలిగించేదేనని అన్నాడు. గతంలో అదే ఆశ్రమంలో ఉద్యోగిగా ఉన్న సమయంలో దీనంగా వారు చూసే చూపులు తనను కదిల్చివేసేవని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. తన ఉద్దేశాన్ని ప్రధాని షింజో అబేకు తెలియజేయాలని వేడుకున్నాడు. మానవత్వంతోనే తానీ పని చేయాలని నిర్ణయించుకున్నానని, ఎంతో ఆలోచించిన మీదట ఈ పనే చేయాలని తన మనసు చెప్పిందని అన్నాడు. తన లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలని కోరాడు. ఇప్పుడీ లేఖ జపాన్ లో సంచలనం కలిగిస్తోంది.