: గవాస్కర్ చారిత్రాత్మక పరుగు టేపును పోగొట్టుకున్న దూరదర్శన్
ఇప్పుడైతే వందల కొద్దీ టీవీ చానళ్లు ఉన్నాయి. ఏది జరిగినా అధిక మొత్తంలో వీడియో రికార్డులు, సీడీలు, హార్డ్ డిస్కుల్లో నిక్షిప్తమవుతున్నాయి. కానీ, ఓ 30 ఏళ్ల క్రితం... ఘటన జరిగిన సమయంలో ఉన్న వీడియో రికార్డింగ్ క్యాసెట్ మాత్రమే విషయాన్ని భద్రపరిచే సాధనం. ఎన్నో చారిత్రక ఘటనలకు సంబంధించిన అతిపెద్ద వీడియో లైబ్రరీని దూరదర్శన్ నిర్వహిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎన్నో విలువైన వీడియోలను భవిష్యత్ తరాలకు అందకుండా చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, తన కెరీర్ లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకుంటున్న వేళ, తీసిన వీడియోను దూరదర్శన్ పోగొట్టుకుంది. 1987 మార్చి 4 నుంచి 9వ తేదీ వరకూ అహ్మదాబాద్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డ వేళ, గవాస్కర్ ఈ చారిత్రాత్మక మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ టేపును పోగొట్టుకున్న విషయాన్ని సమాచార హక్కు చట్టాన్ని వినియోగించి ఓ దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. ఇంతకీ, ఈ టేప్ ఎలా మాయమైందన్న విషయాన్ని ఆర్కైవ్స్ ను నిర్వహిస్తున్న ఆరుగురు సిబ్బందీ చెప్పలేకపోయారు. ఈ ఒక్కటే కాదు, 1987లో మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్, 1987 వరల్డ్ కప్ టేపులు కూడా మాయమయ్యాయి. కాగా, తన పరుగుల వీడియోలు మాయం కావడం దురదృష్టకరమని ప్రస్తుతం వెస్టిండీస్ లో భారత జట్టుతో పాటున్న గవాస్కర్ వ్యాఖ్యానించారు. వీటన్నింటినీ ముందుగానే డిజిటలైజ్ చేయించి వుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కనీసం ఇప్పటికైనా ఆ పని ప్రారంభించాలని సూచించారు.