: ఆనాడు ప్రణబ్ ముఖర్జీ నా వేలు పట్టుకుని నడిపించారు: నరేంద్ర మోదీ
భారత రాష్ట్రపతిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న ప్రణబ్ ముఖర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన్ని పెద్దన్నగా, మార్గదర్శిగా అభివర్ణించారు. "ఢిల్లీ ప్రపంచంలోకి నేను వచ్చిన వేళ, నాకంతా కొత్తగా అనిపించేది. చాలా విషయాల్లో నాకు అవగాహన ఉండేది కాదు. రాష్ట్రపతి నా వేలు పట్టుకుని నడిపించారు. ఎన్నో అంశాల్లో సలహాలు ఇచ్చారు. ఆయనతో నాకు చాలా దగ్గరి సంబంధాలున్నాయి" అని రాష్ట్రపతి భవన్ మ్యూజియం రెండో దశ ప్రారంభించేందుకు వచ్చిన మోదీ వ్యాఖ్యానించారు. దేశంలోని సామాన్యుడికి, అధికారంలోని ప్రభుత్వానికి మధ్య వారధిగా రాష్ట్రపతి భవన్ ను మార్చడంలో ప్రణబ్ కృషి ఎంతగానో ఉందని కొనియాడారు. తన రాజకీయ నేపథ్యం వేరని, ప్రణబ్ రాజకీయ నేపథ్యం ఎన్నో సవాళ్లు, ఎత్తుపల్లాలను దాటి వచ్చిందని గుర్తు చేసిన మోదీ, ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆయనకెంతో పట్టుందని అన్నారు.