: ఏపీ ఎంసెట్ లో 23 వేల ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థినికి టీఎస్ ఎంసెట్ లో 13వ ర్యాంకు... ఎంసెట్-2 లీక్ వీరుల్ని గుర్తించిన సీఐడీ
హైదరాబాద్ జేఎన్టీయూలో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతో ప్రింటింగ్ ప్రెస్ నుంచి తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షా పత్రాన్ని లీక్ చేశారని సీఐడీ అధికారులు గుర్తించారు. దీని వెనుక కుమార్, దయాకర్ అనే వ్యక్తుల హస్తముందని తెలుస్తోంది. కుమార్ కూతురికి ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఎంసెట్ పరీక్షలో 23 వేల ర్యాంకు రాగా, తెలంగాణ నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షలో 13వ ర్యాంకు వచ్చిందని సీఐడీ విచారణలో వెల్లడైంది. ఈ విద్యార్థినితో పాటు మొత్తం ఐదుగురికి వచ్చిన ర్యాంకులపై అధికారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వీరంతా గత వారం రోజులుగా అదృశ్యం కావడంతో, లీక్ వెనుక వీరే ఉండి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. పేపర్ లీక్ అయినట్టు గతంలోనే వార్తలు రాగా, ఇంతవరకూ ఎలాంటి కేసూ నమోదు కాలేదన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ సర్కారు ఆదేశం మేరకు రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు, లీక్ పై కేసు నమోదు చేసి, ఒక్కో విషయాన్ని వెల్లడిస్తామని చెబుతున్నారు.