: బోయపాటి దర్శకత్వంలో కృష్ణమ్మకు హారతి... సాయికుమార్ వాయిస్ ఓవర్
కృష్ణా పుష్కరాల సమయంలో నదీమతల్లికి హారతినిచ్చే దృశ్యాలను చిత్రీకరించే బాధ్యతలను ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించినట్టు ఏపీ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. హారతిచ్చే వేదిక డిజైన్ల పనులు కూడా ఆయనకే అప్పగించినట్టు వెల్లడించారు. దీనికి వాయిస్ ఓవర్ ను ప్రముఖ నటుడు సాయికుమార్ అందిస్తారని ఆయన తెలిపారు. హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి, చరిత్రలో నిలిచిపోయేలా చూడాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించారని ప్రసాద్ తెలిపారు. పుష్కరాలు జరిగే అన్ని రోజుల్లో కనకదుర్గమ్మ, శ్రీశైల మల్లికార్జున దేవాలయాలను 22 గంటల పాటు తెరచే ఉంచుతామని తెలిపారు. కాగా, గత సంవత్సరం జరిగిన గోదావరి పుష్కరాల వేళ, తొక్కిసలాటకు బోయపాటి దర్శకత్వ ఏర్పాట్లు కూడా కారణమేనని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలు ప్రాణాలు పోతున్న వేళ, ఆయన షార్ట్ ఫిల్మ్ షూట్ చేస్తూ ఉన్నాడన్న విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని పక్కనబెట్టిన చంద్రబాబు సర్కారు కృష్ణమ్మ హారతికి దృశ్యరూపం ఇచ్చే బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించడం గమనార్హం.