: రక్తమోడిన జపాన్: కేర్‌హోమ్‌పై కత్తితో యువకుడి దాడి.. 19 మంది మృతి
జపాన్ రాజధాని టోక్యో వికలాంగుల రక్తంతో తడిసిపోయింది. 26 ఏళ్ల దుండగుడు ఓ కేర్‌హోమ్‌పై కత్తితో దాడిచేసి అందులోని మానసిక వికలాంగులను దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే గాయపడిన వారి సంఖ్య 50కి పైగానే ఉంటుందని స్థానిక మీడియా పేర్కొంది. నల్ల దుస్తులు ధరించిన ఓ దుండగుడు సాగమిహర వికలాంగుల ఆశ్రమంలోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 19 మంది మృతిచెందినట్టు నిర్ధారించారు. దుండగుడిని సతోషి యెమత్సుగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి సంచిలో నుంచి రక్తంతో తడిసిన పలు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఘటన వెనుక కారణాలపై ఆరా తీస్తున్నారు.