: నవ్యాంధ్ర రాజధానికి ఈ నెలలో సచివాలయ తరలింపు లేనట్టే.. ఐదోసారీ వాయిదా పడిన ప్రక్రియ
నవ్యాంధ్ర రాజధానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియ రోజురోజుకు మరింత ఆలస్యమవుతోంది. ఆగస్టులో పుష్కరాలు ఉండడం వల్ల ఈనెల 29న జరగాల్సిన తరలింపు కార్యక్రమం మరోమారు వాయిదా పడింది. వర్షాలు, భవన నిర్మాణాల్లో జాప్యం కారణంగా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు సజావుగా సాగడం లేదు. ఇప్పటి వరకు 8 తేదీలను ప్రకటించిన ప్రభుత్వం తరలింపును ఐదుసార్లు వాయిదా వేయడం గమనార్హం. తాజాగా మరో తేదీని మళ్లీ తెరపైకి తెచ్చారు. ఆగస్టు మొదటి వారం లేదంటే రెండో వారంలో తరలింపు ప్రక్రియను చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలోనూ ఇప్పటి వరకు స్పష్టత లేదు. కృష్ణా పుష్కరాల అనంతరం తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలను మే నెలలోనే నవ్యాంధ్రలోని వెలగపూడికి తరలించాని ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత ఆ ప్రక్రియను జూన్ 15కు, అనంతరం జూన్ 27కు వాయిదా వేసింది. ఈ విషయంలో ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో కార్యాలయాలను దశలవారీగా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 29న నాలుగు శాఖలు, జూలై 6న రెండు, జూలై 15న మరికొన్ని, జూలై 21న మిగిలిన శాఖలను తరలించాలని సర్క్యులర్ జారీ చేసింది. అయితే వర్షాలు, నిర్మాణాల్లో జాప్యం కారణంగా తరలింపును పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ఆగస్టు వరకూ కార్యాలయాల భవన నిర్మాణాలు పూర్తయ్యే అవకాశాలు లేకపోయినా పదేపదే తరలింపును ముందుకు తీసుకొస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేదీలు ప్రకటించడంతో వెలగపూడి సందర్శన కోసం వెళ్తున్న ఉద్యోగులకు ఖరీదైన బస్సులు ఏర్పాటు చేస్తూ తిప్పడం వల్ల అనవసర ఖర్చు తప్ప ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదని విమర్శిస్తున్నారు. వీలైనంత తొందరగా ప్రభుత్వ కార్యాలయాలను వెలగపూడికి తరలించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు పదేపదే ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరి ఈసారైనా నిర్ణయించిన తేదీల్లో కార్యాలయాలు వెలగపూడికి తరలుతాయో లేదో వేచి చూడాల్సిందే.