: ముఖ్యమంత్రిని పేరు పెట్టి పిలవకూడదు.. మాజీ సీఎం అయితే ఓకే!: తేల్చి చెప్పిన తమిళ స్పీకర్


పేరులో ఏముంది గొప్ప.. అని చాలామంది తేలిగ్గా తీసిపారేస్తారు. కానీ అందులోనే అంతా ఉందన్న సంగతి తాజాగా తమిళనాడు అసెంబ్లీలో రుజువైంది. సోమవారం అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ చర్చలో ఈ విషయం అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే సభ్యులకు బోధపడింది. చర్చలో భాగంగా అన్నాడీఎంకే సభ్యుడు నరసింహన్ మాట్లాడుతూ ‘కరుణానిధి’ అని ప్రస్తావించడం అసెంబ్లీలో పెద్ద దుమారమే లేపింది. డీఎంకే సభ్యులు ఒక్కసారిగా లేచి ఆయన వ్యాఖ్యలకు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, పెద్దాయనను ఇలా పేరు పెట్టి పిలవడం ఏంటంటూ మూకుమ్మడిగా నిరసన తెలిపారు. ఈ విషయమై స్పీకర్ ధనపాల్‌ను నిలదీశారు. స్పందించిన స్పీకర్.. ఇందులో అమర్యాద ఏమీ లేదని, డీఎంకే సభ్యుడి పేరును గౌరవ సూచకంగానే సంబోధించారని పేర్కొంటూ అలజడిని చల్లార్చేందుకు ప్రయత్నించారు. స్పీకర్ వ్యాఖ్యలు ప్రతిపక్ష సభ్యులను ఏమాత్రం శాంతింపజేయలేకపోయాయి. తాము కూడా ముఖ్యమంత్రిని పేరుపెట్టి పిలుస్తామని, మీరు చూస్తూ ఉండగలరా? అని డీఎంకే సభ్యుడు దురైమురుగన్ ప్రశ్నించారు. దీంతో మరోమారు స్పందించిన స్పీకర్.. శాసనసభ్యుడి పేరును గౌరవ సూచకంగా సంబోధించవచ్చు కానీ ముఖ్యమంత్రిని అలా పిలవకూడదని, ఇది తన ఆదేశమని పేర్కొన్నారు. అయినా ఏమాత్రం శాంతించని ప్రతిపక్ష సభ్యులు కరుణానిధిని మాజీ సీఎం అని సంబోధించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

  • Loading...

More Telugu News