: 'నో స్కూల్ గోయింగ్ మిషన్'కు ఆదేశించిన భారత ప్రభుత్వం... పాక్ పై కఠిన నిర్ణయం తీసుకోనుందా?
భారత్-చైనా దోస్తీలో మార్పులు చోటుచేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో పాకిస్థాన్-భారత సంబంధాల్లో కూడా తీవ్ర మార్పులు చోటుచేసుకోనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చైనాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులకు వీసా మంజూరు చేయకుండా కఠిన నిర్ణయం తీసుకున్న భారత్ తాజాగా పాక్ లో నో స్కూల్ గోయింగ్ మిషన్ అమలు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. తీవ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తరువాత జమ్మూకాశ్మీర్ లో పాకిస్థాన్ సిరాజ్ ఉల్ హకూన్ నేతృత్వంలోని జమాతే ఇస్లామి(జేఐ) వంటి సంస్థలతో భారత్ లో అల్లర్లకు కుట్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో ఉన్న భారత హై కమిషన్ కార్యాలయం ముట్టడికి ఆ సంస్థ పిలుపు నిచ్చింది. మరోవైపు హఫీజ్ సయీద్ కు చెందిన 'జమాత్ ఉల్ దవా' వైద్య బృందం ఒకటి ఇస్లామాబాద్ హై కమిషన్ లో భారత వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడి ఇండియన్ హైకమిషన్ వద్ద ఉద్రక్తత నెలకొంది. వెంటనే భారత ప్రభుత్వం 'నో స్కూల్ గోయింగ్ మిషన్'కు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఇండియన్ హైకమిషన్ లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులెవరూ తమ పిల్లలను పాక్ లోని స్కూళ్లకు పంపకూడదు. అక్కడి స్కూళ్లలో చదువుతున్న పిల్లలందర్నీ ఇండియాకు పంపాలని హై కమిషనర్ గౌతమ్ బంబావతేను ప్రభుత్వం ఆదేశించింది. తీవ్ర పరిణామాలు ఉత్పన్నమయ్యే పరిస్థితుల్లో తప్ప ఇంకెప్పుడూ భారత్ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పాక్ పై ఎలాంటి చర్యలకు భారత్ సిద్ధమవుతోందన్న అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. నిన్న రావల్పిండి నుంచి బయలుదేరిన జమాతే ఇస్లామి (జేఐ) భారీ ర్యాలీలో ఆ సంస్థకు చెందిన వేలాది మంది కార్యకర్తలు బస్సులు, బైకులతో ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ కార్యాలయం వైపుకు కదులుతున్నారు. ఈ మేరకు అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం ఇండియన్ కాన్సులేట్ చుట్టుపక్కల ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించి, భద్రతను కట్టుదిట్టం చేసింది. సాయుధ బలగాలతో పాటు వెయ్యిమంది పోలీసులను మోహరించింది. ఈ సంస్థ వచ్చే వారం కశ్మీర్ సరిహద్దు వరకు ర్యాలీ నిర్వహించనుంది. ఇప్పటికే జమ్మూాకాశ్మీర్ లో భారీగా సైన్యాన్ని మోహరించిన భారత ప్రభుత్వం తదుపరి ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సరిహద్దుల వరకు వచ్చే జమాతే దుందుడుకు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడదనడంలో ఎలాంటి సందేహం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.