: ఇండియాలో పేదరికాన్ని వీడి మధ్య తరగతిలోకి వచ్చిన 30 కోట్ల మంది!


భారత మధ్యతరగతి ప్రపంచంలోకి కొత్తగా కొన్ని వర్గాల ప్రజలు వచ్చి చేరారు. 'రైజ్ ఆఫ్ ది న్యూ మిడిల్ క్లాస్ అండ్ ది రోల్ ఆఫ్ ఆఫ్షోరింగ్ ఆఫ్ సర్వీసెస్' పేరిట ముంబై యూనివర్శిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ నీరజ్ హతేకర్, అతని సహచరులు కిషోర్, సంధ్యా కృష్ణన్ ఓ అధ్యయనాన్ని వెలువరించారు. ఇండియాలో ప్రస్తుతం రోజుకు రూ. 134 నుంచి రూ. 268 మధ్య ఖర్చు పెడుతున్న వారిని దిగువ మధ్య తరగతిగా అభివర్ణిస్తుండగా, ఆ జాబితాలోకి పానీ పూరీలు అమ్మేవారు, రోడ్ల పక్కన దోశ, ఇడ్లీ అమ్ముకునే చిరువ్యాపారులు, కార్పెంటింగ్, వెల్డింగ్, ఇస్త్రీ పనులు చేస్తూ పొట్టపోసుకునేవారు, కారు డ్రైవర్లు, టీవీ టెక్నీషియన్లు కొత్తగా వచ్చి చేరారని తెలిపారు. వీరంతా పేదరికం స్థాయిని వీడి మధ్య తరగతి వర్గంలో చేరిపోయారని, రూ. 134 కన్నా (రెండు డాలర్లు) తక్కువ వెచ్చిస్తున్న వారు పేదలుగా ఉన్నారని నీరజ్ హతేకర్ వెల్లడించారు. మొత్తం 800 గృహాలను అధ్యయనంలో భాగం చేయగా, దాదాపు అందరి వద్దా సెల్ ఫోన్ ఉందని, ఓ వాచ్ లేదా వాల్ క్లాక్ ఉందని తెలిపారు. 70 శాతం మందికి పైగా విద్యుత్ సౌకర్యం ఉన్న ఇళ్లలో ఉంటున్నారని, 60 శాతం మంది ఇళ్లలో ఓ ఫ్యాన్, కలర్ టీవీ, ప్రెజర్ కుక్కర్, అతిథులు కూర్చునేందుకు కుర్చీలు ఉన్నాయని వివరించారు. 50 శాతం మందికి పైగా బంగారు ఆభరణాలను, విలువైన వంట పాత్రలను కలిగివున్నారని తెలిపారు. కొత్తగా మధ్య తరగతిలోకి వచ్చిన వీరిలో అత్యధికులను దిగువ మధ్యతరగతి వర్గంగానే పరిగణించాల్సి వుందని తెలిపారు. 2004 నుంచి 2011 మధ్య మారిన పరిస్థితులు వీరి ఆర్థిక స్థితిని మార్చాయని వివరించారు. మొత్తం మీద దేశంలో మధ్య తరగతి ప్రజల సంఖ్య 30.4 కోట్ల నుంచి 60.4 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News