: మల్లన్నసాగర్ ఉద్రిక్తత ఎపెక్ట్!... ఆఖరి క్షణంలో జపాన్ టూర్ ను రద్దు చేసుకున్న హరీశ్ రావు!
మెదక్ జిల్లాలో తెలంగాణ సర్కారు నిర్మించతలపెట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై నిన్న నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కేసీఆర్ సర్కారుపై పెను ప్రభావాన్నే చూపాయి. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిన్న పాదయాత్ర చేపట్టిన నిరసనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. తమపై నిరసనకారులు రాళ్లు రువ్విన తర్వాతే వారిని అదుపు చేసేందుకు మాత్రమే తాము లాఠీచార్జీ, గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న తమపై పోలీసులే దురుసుగా వ్యవహరించారని నిరసనకారులు వాదిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రభుత్వంపై బాగానే పడినట్టుంది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం నిన్న రాత్రి తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తన శాఖకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి జపాన్ బయలుదేరాల్సి ఉంది. ఈ పర్యటనకు ఇప్పటికే ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఈ క్రమంలో నిన్న జపాన్ పర్యటనకు వెళ్లేందుకు హరీశ్ రావు అంతా సిద్ధం చేసుకున్నారు. మరికాసేపట్లో ఆయన విమానాశ్రయానికి బయలుదేరతారనగా... మల్లన్నసాగర్ ఉద్రిక్తతపై విపక్షాలు భారీ నిరసనలు చేపట్టనున్నాయన్న వార్తలు అందాయి. దీంతో సీఎం కేసీఆర్ తో మంతనాలు సాగించిన హరీశ్ రావు తన పర్యటనను అర్థాంతరంగా వాయిదా వేసుకున్నారు. నేటి ఉదయం నుంచే అటు జేఏసీతో పాటు ఇటు విపక్షాలు ఆందోళనలకు దిగగా... విదేశీ పర్యటనను రద్దు చేసుకున్న హరీశ్ రావు కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి విపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు.