: అమరావతిలో మాగాణి భూములు లాక్కున్నప్పుడు ఏమయ్యారు?: తెలుగుదేశం నేతలపై హరీశ్ రావు నిప్పులు
ఏపీ తెలుగుదేశం నేతలు ఒకలా, తెలంగాణ నేతలు మరోలా వ్యవహరిస్తూ, రెండు నాల్కల ధోరణిని ప్రత్యక్షంగా చూపుతున్నారని మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాజధాని పేరిట రెండు పంటలు పండే మాగాణి భూములను రైతుల నుంచి లాక్కున్న సమయంలో ఈ నేతలంతా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. భూసేకరణ చట్టం-2013 వద్దని కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు సంతకాలు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, ఇక్కడి నేతలు మాత్రం దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయడం ఎంత వరకూ సమంజసమని అడిగారు. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని, ఏదైనా నష్టం జరిగితే అందుకు వారిదే బాధ్యతని హెచ్చరించారు. అమరావతి ప్రాంతంలో విలపిస్తున్న రైతుల గురించి ముందుగా ఆలోచించి పోరాడాలని ఎద్దేవా చేశారు. మల్లన్నసాగర్ విషయంలో ఎవరికీ అన్యాయం జరగబోదని, రైతులు అర్థం చేసుకుంటారన్న నమ్మకం తనకుందని తెలిపారు.