: విమానం మిస్సింగ్... అడుగంటుతున్న ఆశలు... కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్!
నాలుగు రోజుల నాడు బంగాళాఖాతంపై అదృశ్యమైన భారత వాయుసేన విమానం ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ విమానం సముద్రంలో కూలి ఉంటుందని భావిస్తున్న ప్రాంతంలో 3,500 మీటర్ల వరకూ లోతు ఉంటుందని, కొన్ని చోట్ల అంతకు రెట్టింపైన అగాధాలు కూడా ఉన్నాయని అధికారులు అంటున్నారు. రోజులు గడిచేకొద్దీ విమానం జాడ తెలుస్తుందన్న నమ్మకాలు తగ్గుతున్నాయి. శాటిలైట్ తీసిన హై రెజల్యూషన్ చిత్రాల్లో కొన్ని తేలియాడుతున్న వస్తువులు కనిపించడంతో, సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులు ఆ దిశగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. శాటిలైట్లు సూచించిన ప్రాంతాల్లో యుద్ధ నౌకలు వెతుకుతున్నాయని, ఇప్పటివరకూ ఎలాంటి తేలియాడే వస్తువులూ, విమాన శకలాలు కనిపించలేదని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, తాంబరం నుంచి శుక్రవారం ఉదయం 8:30కి విమాన సిబ్బంది సహా 29 మందితో టేకాఫ్ అయిన విమాన,, 8:46 గంటల సమయంలో రేడియో కాంటాక్టును కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత విమానం ఏమైందన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.