: క్షమించేంత చిన్న తప్పు కాదిది... తేలే వరకూ పార్లమెంటుకు రావద్దని ఆప్ ఎంపీని ఆదేశించిన స్పీకర్
పార్లమెంటులోకి ప్రవేశించే క్రమంలో వివిధ అంచెల భద్రతను ఎలా దాటుకుంటూ వెళ్లాలో చెబుతూ 'మీరు గతంలో ఎన్నడూ చూడనిది ఇవాళ చూడబోతున్నారు' అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ ఇచ్చిన లైవ్ స్ట్రీమింగ్ విషయం క్షమించేంత చిన్నది కాదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన పని కేవలం క్షమాపణ చెబితే మరచిపోయేది కాదని, ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంలో 9 మంది సభ్యుల కమిటీని నియమించినందున, వారి నివేదిక వచ్చేంత వరకూ సభలో కాలు పెట్టవద్దని భగవంత్ మాన్ ను ఆదేశించారు. ఆగస్టు 3లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించిన స్పీకర్, నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇకపై ఇటువంటి ఘటనలు జరుగకుండా చర్యలు చేపడతామని అన్నారు. తాను చేసిన పనిపై భగవంత్ ఇప్పటికే క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.