: కర్ణాటకలో మొదలైన ఆర్టీసీ సమ్మె, తెలుగు రాష్ట్రాలపై ప్రభావం


తమ వేతనాలను తక్షణం పెంచాలని డిమాండ్ చేస్తూ, కర్ణాటకలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చేపట్టిన నిరవధిక సమ్మెతో ప్రజా జీవనానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. మొత్తం 1.23 లక్షల మంది ఉద్యోగులు సమ్మెకు దిగగా, 23 వేలకు పైగా బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల బంద్ ప్రభావం కర్నూలు, అనంతపురం జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యమూ 2 వేలకు పైగా బస్సులు కర్ణాటక నుంచి తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఒక్క హైదరాబాద్ కే బెంగళూరు, బీదర్ ప్రాంతాల నుంచి 50కి పైగా కేఎస్ఆర్టీసీ సర్వీసులు నడుస్తుంటాయి. సింథనూరు, మైసూరు ప్రాంతాల నుంచి విజయవాడకు బస్సులు ఉండగా, ఇవన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. "ఉద్యోగులు 30 శాతం మేరకు వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ. 4,550 కోట్లు భారం పడుతుంది. మేము 10 శాతం మేరకు వేతన సవరణకు అంగీకరించాం. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్రల్లో ఆర్టీసీ ఉద్యోగులు పొందుతున్న వేతనాల కన్నా తమకు అధికంగా కావాలని అడుగుతున్నారు. అదెలా సాధ్యపడుతుంది? అయినా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్నాం" అని రవాణా మంత్రి రామలింగారెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News