: కోదండరాంను అరెస్ట్ చేసిన పోలీసులు!... ఒంటిమామిడి వద్ద హైటెన్షన్!
మెదక్ జిల్లాలో కేసీఆర్ సర్కారు నిర్మించతలపెట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు తెలంగాణను రావణకాష్టంగా మార్చే ప్రమాదం కనిపిస్తోంది. నిన్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ప్రజలపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. జనం కూడా పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వెరసి రాజీవ్ రహదారి రణరంగాన్నే తలపించింది. తాజాగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు వెళుతున్న జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ముంపు గ్రామాల పర్యటనకు బయలుదేరిన కోదండరాంను పోలీసులు ఒంటిమామిడి వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులు, జేఏసీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోదండరాంను అరెస్ట్ చేసేందుకు యత్నించిన పోలీసులను జేఏసీ నేతలు ప్రతిఘటించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు జేఏసీ నేతలను అదుపు చేయగలిగిన పోలీసులు కోదండరాంను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.