: డబ్బులిచ్చి, కాంట్రాక్టులిచ్చి ఎవరినీ మా పార్టీలోకి ఆహ్వానించట్లేదు: డీఎస్
వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని, 2024 నాటికి ఈ రాష్ట్రం పరిస్థితే మారిపోతుందని టీఆర్ఎస్ ఎంపీ డీఎస్ (డి.శ్రీనివాస్) అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయిందని, తెలంగాణాను అభివృద్ధి చేసేందుకు చాలా పెద్ద అజెండా ఉందని, ఈ రెండేళ్లలో అన్నీ చేయడం సాధ్యం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రెండేళ్ల టీఆర్ఎస్ పాలన ఆశాజనకంగా లేదు అని ఎవరైనా విమర్శించే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని, తక్కువ సమయంలో అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తమ పార్టీ విధానాలు నచ్చడం వల్ల, బంగారు తెలంగాణ సాధించుకోవాలనే ఉద్దేశంతోనే ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వస్తున్నారు తప్పా, డబ్బులిచ్చి, కాంట్రాక్టులిచ్చి తామెవరినీ ఆహ్వానించట్లేదని మరో ప్రశ్నకు జావాబుగా టీఆర్ఎస్ నేత డీఎస్ చెప్పారు.