: బీజేపీ, బీఎస్పీ నేతల 'అసభ్య' యుద్ధం!
ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత దయాశంకర్ సింగ్, మాయావతిని వేశ్యతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం ఇప్పుడు బీజేపీ, బీఎస్పీ మధ్య అసభ్య పదజాలంతో కూడిన మాటల యుద్ధానికి దారితీసింది. ఇరు పార్టీల నేతలూ రాయడానికి వీల్లేని తీవ్ర పదజాలాన్ని వినియోగిస్తుండటం, విమర్శలు, ప్రతివిమర్శలు పెచ్చుమీరడంతో యూపీలో ఉద్రిక్తత పెరుగుతోంది. దయాశంకర్ వ్యాఖ్యలను తప్పుబడుతూ, ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ, బీఎస్పీ నేతలు ఆయన కుమార్తెను లక్ష్యంగా చేసుకుని అసభ్య మాటలు వాడటాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది. లక్నో వీధులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్న బీఎస్పీ శ్రేణులు దయాశంకర్ తో పాటు బీజేపీపై విరుచుకుపడుతున్నాయి. ఇక దళిత నేతగా రాష్ట్రంలో మంచి పేరున్న కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సైతం ఈ మాటల యుద్ధంలోకి దిగారు. "పార్లమెంటు మొత్తం మాయావతిపై వాడిన వ్యాఖ్యలను ఖండించింది. దయాశంకర్ చేయగూడని విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఆయన మైనర్ కుమార్తెపై బీఎస్పీ నేతలు చేసిన వ్యాఖ్యల సంగతేంటి? మాయావతి కూడా దయాశంకర్ కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి" అని పాశ్వాన్ డిమాండ్ చేశారు. ఈ వివాదంలోకి దయాశంకర్ భార్యను లాగాలని చూస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మ ఆరోపించారు. తమ పార్టీ మహిళా నేతలపై బీఎస్పీ నేతలు అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతున్నారని, దీన్ని సహించేది లేదని హెచ్చరించారు.