: 800 మందికి డబ్బిచ్చి ముస్లింలుగా మార్చిన ఉగ్రవాదులు!
శనివారం నాడు ముంబైలోని కల్యాణ్ ప్రాంతంలో ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేసిన రిజ్వాన్ ఖాన్, అంతకుముందు నవీ ముంబైలో అదుపులోకి తీసుకున్న అర్షిద్ ఖురేషీలు సుమారు 800 మందిని ఇస్లాం మతంలోకి మార్చారని తమ విచారణలో వెల్లడైందని అధికారులు తెలిపారు. వీరిని విచారించిన ఉన్నతాధికారులు పలు కీలక వివరాలు రాబట్టారు. వివాదాస్పద ముస్లిం ప్రచారకుడు జకీర్ నాయక్ నిర్వహిస్తున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)కు చెందిన వీరి నుంచి పలు కీలక డాక్యుమెంట్లు, వివాహ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. క్రిస్టియన్, హిందూ మతాలకు చెందిన 800 మందికి పైగా ప్రజలను ముస్లిం మతంలోకి మార్చినట్టు వీటి ద్వారా వెల్లడైందని తెలిపారు. "మా విచారణలో వెల్లడైన వివరాలు చాలా తీవ్రమైనవి. ఈ విషయాన్ని వెంటనే పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాలేజీ విద్యార్థులు, జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు వీరి లక్ష్యం. ఆర్థిక సహాయం చేయడం, జైల్లోని వారికి బెయిల్ ఇప్పించడం వంటి పనులు చేసి ఆపై వారిని మత మార్పిడులకు ప్రోత్సహిస్తున్నారు" అని ఓ అధికారి వెల్లడించారు. కాగా, రిజ్వాన్ ఖాన్ తమ సంస్థను సందర్శించాడే తప్ప, ఏ విధమైన సంబంధాన్ని పెట్టుకోలేదని ఐఆర్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.