: రోడ్డు దాటుతుండగా రాజస్థాన్ మంత్రిని ఢీ కొట్టిన స్కూటరిస్టు
మందీ మార్బలం పక్కనే ఉండగా రోడ్డు దాటుతున్న రాజస్థాన్ మంత్రిని స్కూటరిస్ట్ ఢీ కొన్న ఘటన అజ్మీర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి వాసుదేవ్ దేవ్ నాని అజ్మీర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఉన్న మరో ప్రదేశానికి వెళ్లేందుకు అనుచరులు, కార్యకర్తలతో కలిసి రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. ఇంతలో అటుగా వచ్చిన ఓ స్కూటరిస్టు ఆ రోడ్డులో వస్తున్న మంత్రిని ఢీ కొట్టాడు. దీంతో మంత్రి గాయపడ్డారు. వెంటనే ఆయనను అజ్మీర్ లోని జేఎల్ఎన్ ఆసుపత్రికి తరలించగా, ఆయన కాలికి ఫ్రాక్చర్ అయిందని, శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు.