: 60 ఏళ్లుగా సేవలందించిన ఐఎన్ఎస్ విరాట్ చివరి ప్రయాణం!
భారత నావికాదళానికి 60 ఏళ్లుగా సేవలందిస్తున్న ఐఎన్ఎస్ విరాట్ చివరి ప్రయాణానికి సిద్ధమవుతోంది. సుదీర్ఘ కాలం భారత నావికాదళ అమ్ములపొదిలో ప్రధాన విమాన వాహకనౌకగా సేవలందించిన ఐఎన్ఎస్ విరాట్...ముంబై నుంచి కొచ్చికి చివరి ప్రయాణం చేయనుంది. అనంతరం ఈ యుద్ధవాహక నౌక శాశ్వత విశ్రాంతి తీసుకోనుంది. కొచ్చి నుంచి ముంబై తిరిగి చేరుకున్న తరువాత దశలవారీగా దీనిని నేవీ నుంచి డీకమిషన్ చేయనున్నారు. సుదీర్ఘ కాలం సేవలందించిన విరాట్ ను డీకమిషన్ చేయడానికి గల కారణాలను అధికారులు వెల్లడించకపోవడం విశేషం. 1959 నవంబరు 18న హెచ్‌ఎంఎస్ హెర్మెస్ పేరుతో ఈ యుద్ధవాహక నౌక బ్రిటిష్ రాయల్ నేవీలో రంగ ప్రవేశం చేసింది. 1987 వరకు బ్రిటిష్ రాయల్ నేవీకి సేవలందించింది. 1987లో బ్రిటన్ నుంచి భారత్ దీనిని కొనుగోలు చేసింది. దీంతో 1987 మే 12న ఐఎన్‌ఎస్ విరాట్ భారత నౌకాదళంలో చేరింది. అప్పటి నుంచి ఇండియన్ నేవీలో ఐఎన్ఎస్ విరాట్ కీలకంగా మారింది. డీకమిషనింగ్ అనంతరం మ్యూజియంగా మారనుంది. కాగా, దీనిని తమకు ఇవ్వవలసిందిగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని అడిగిన సంగతి తెలిసిందే. భవిష్యత్ లో టూరిజాన్ని ప్రోత్సహించడంలో భాగంగా దీనిలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.