: పదవీ విరమణ చేస్తోన్న డీజీపీ రాముడుకి ఘనంగా వీడ్కోలు
నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి డీజీపీగా సేవలందించిన జేవీ రాముడు పదవీ విరమణ చేస్తోన్న సందర్భంగా ఆయనకి విజయవాడలో ఘనంగా వీడ్కోలు లభించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో వీడ్కోలు పరేడ్ నిర్వహించారు. నాలుగు ఏపీఎస్పీ బెటాలియన్లు జేవీ రాముడుకి గౌరవ వందనం సమర్పించి ఘనంగా వీడ్కోలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులందరూ రావడం విశేషం. నవ్యాంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర పోలీసు విభాగాన్ని ఎంతో సమర్థవంతంగా జేవీ రాముడు నడిపించారని ఇంఛార్జి డీజీపీ సాంబశివరావు ఈ సందర్భంగా అన్నారు. ఎన్నో సౌకర్యాలు తమకు లేవని, అయినా ఆ పరిస్థితులను అధిగమించి పోలీసు శాఖ అభివృద్ధికి జేవీ రాముడు మార్గనిర్దేశాన్ని చేశారని ఆయన వ్యాఖ్యానించారు. తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా జేవీ రాముడు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఏపీ సీనియర్ పోలీసు అధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు అందరి నుంచీ సహకారం లభించిందని ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. మంచి సౌకర్యాలు లేకపోయినా పోలీసులు ఎవరూ తనను వాటి గురించి ప్రశ్నించలేదని ఆయన చెప్పారు.