: తూ.గో.జిల్లా టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!... భూ వివాదంలో తలదూర్చడమే కారణమట!
టీడీపీ యువనేత, తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ భూ వివాదంలో తలదూర్చిన ఆయనపై హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు. వివరాల్లోకెళితే... జిల్లాలోని కాట్రేనికోట మండలం పోరపేటలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ భూ కుంభకోణంలో దాట్ల సుబ్బరాజుతో పాటు స్థానిక సీఐ రమణారావు, ఎస్సై షేక్ జానీ బాషాలకు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై దాఖలైన ఓ పిటిషన్ ను విచారించిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఎమ్మెల్యే సహా, ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సుబ్బరాజు సహా ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే... ఈ భూ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను అనవసరంగా ఇరికించారని సుబ్బరాజు వాపోతున్నారు.