: చేతులెత్తేసిన ట్రాన్స్ ట్రాయ్!... నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులు!
ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రముఖ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ‘ట్రాన్స్ ట్రాయ్’ మరింత విషమ పరిస్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నిధుల లేమితో ఇప్పటికే పోలవరం పనులను నత్తనడకన సాగిస్తున్న ఆ కంపెనీ... తాజాగా తన వద్ద పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితిలోకి వెళ్లింది. వెరసి జాతీయ ప్రాజెక్టు హోదా పొందిన పోలవరం ప్రాజెక్టు పనులు మూడు రోజులుగా అర్థాంతరంగా నిలిచిపోయాయి. వివరాల్లోకెళితే... పోలవరం ప్రాజెక్టు పనులను దక్కించుకున్న ట్రాన్స్ ట్రాయ్ అక్కడ 500 మంది కార్మికులతో పనులు చేయిస్తోంది. అయితే మూడు నెలలుగా వేతనాలు అందని కారణంగా టిప్పర్, ప్రొక్లెయినర్లకు డ్రైవర్లుగా వ్యవహరిస్తున్న వారంతా ఈ నెల 20న బంద్ మొదలు పెట్టారు. దీంతో కంపెనీ కార్యాలయం వద్ద వాహనాలను నిలిపేసిన కార్మికులు మూడు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. వెరసి పోలవరం పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.