: జల దిగ్బంధంలో అసోం... రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వరదలు
అసోం జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ప్రభావం మూడు లక్షలమందిపై పడింది. వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. జిల్లాలకు జిల్లాలే నీట మునిగాయి. రంగంలోకి దిగిన ఆర్మీ సహాయ కార్యక్రమాలు ప్రారంభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలు పూర్తిగా జలమయమయ్యాయి. 464 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 25వేల ఎకరాల్లోని పంటలు ధ్వంసమైనట్టు అసోం ప్రకృతి విపత్తు నిర్వహణ సంస్థ(ఏఎస్‌డీఎంఏ) ప్రకటించింది. వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన ఆర్మీ శుక్రవారం చిరాంగ్‌లోని ఖంగ్‌రింగ్ ప్రాంతంలో నీటిలో మునిగిపోతున్న 30 మందిని రక్షించింది. నీటిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఆర్మీ ప్రత్యేకంగా బోట్లను సిద్ధం చేసింది. 24 గంటలూ సహాయ కార్యక్రమాలు అందిస్తున్నట్టు తేజాపూర్‌లోని ఆర్మీ ఫ్లడ్ కంట్రోల్ సెంటర్ పేర్కొంది. వరద బాధితులైన 12,428 మంది కోసం 27 రిలీఫ్ క్యాంపులు, ఏడు రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు అధికార యంత్రాంగం పేర్కొంది.