: మ్యూనిక్‌పై ఉగ్రపంజా: షాపింగ్ సెంటర్‌లో కాల్పులు.. 9 మంది మృతి


ఉగ్రవాదులు ఈసారి జర్మనీపై పడ్డారు. మ్యూనిక్ నగరంలోని ఓ షాపింగ్‌మాల్‌లో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 9 మంది పౌరులు మరణించగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఉగ్రదాడేనని అధికారులు పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో సాయుధుడి మృతదేహం పడి ఉండడంతో కాల్పులకు పాల్పడింది ఒకడేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒలంపియా ఇన్‌కౌఫ్‌జెన్‌ట్రమ్ మాల్‌లోకి ఆయుధాలతో ప్రవేశించిన ముగ్గురు దుండగులు యథేచ్ఛగా కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అయితే తాము ఇప్పటి వరకు ఒకరినే గుర్తించామని, అతను తనను తాను కాల్చుకుని మృతి చెందాడని పోలీసులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ వద్ద కాల్పులు జరిపిన ఉగ్రవాది అనంతరం మెట్రో స్టేషన్‌ వైపుగా వెళ్లి అక్కడ కూడా కాల్పులకు పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో మెట్రో స్టేషన్ ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధించారు. ఉగ్రవాదుల కోసం అణువణువూ క్షుణ్ణంగా గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉగ్రవాదులు పట్టుబడకపోవడంతో ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మ్యూనిక్ నగరంలో ఉగ్రదాడి విషయం తెలియగానే నగరంలో ‘ఎమర్జెన్సీ పరిస్థితి’ ఉందంటూ స్మార్ట్ ఫోన్‌ మెసేజ్‌లు వెల్లువెత్తాయి. ట్విట్టర్ ద్వారా పోలీసులు.. ప్రజలను అప్రమత్తం చేశారు. వీలైనంతవరకు అందరూ ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటకు రావద్దని కోరారు. మ్యూనిక్‌లో ప్రజా రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది. నల్లని దుస్తులు ధరించిన ఉగ్రవాది కాల్పులు జరుపుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఎనిమిది రోజుల వ్యవధిలో యూరప్‌లో జరిగిన మూడో అతిపెద్ద ఘటన ఇది. ఫ్రాన్స్‌లోని నీస్‌లో గతవారం ఓ ఉగ్రవాది ట్రక్కుతో తొక్కించి 84 మందిని బలిగొనగా సోమవారం ఓ శరణార్థి రైలులో గొడ్డలి, కత్తితో ప్రయాణికులపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా మ్యూనిక్ నగరంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా పదిమంది గాయపడినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News