: ఆకస్మిక పర్యటనలు చేసి హరితహారం పనులని పరిశీలిస్తా: ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలో చేపట్టిన హరితహారం కార్యక్రమం జరుగుతోన్న తీరు, మొక్కల సంరక్షణను చేపడుతున్న విధానాన్ని తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నుంచి ఆకస్మిక పర్యటనలు చేయనున్నారు. హరితహారంపై ఆయన ఈరోజు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హరితహారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటున్న విధానం, వారి పనితీరుపై అంచనా వేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా జిల్లాల్లో హరితహారం కార్యక్రమాల్లోనే ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. ముందుగా ప్రకటించకుండా ఆయా జిల్లాలకు వెళ్లి హరితహారంలో పాల్గొంటానని, పనులు జరుగుతోన్న తీరుని పరిశీలిస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రతి జిల్లా, నియోజకవర్గం, మండలం వారీగా ప్రణాళిక రూపొందించి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఫైర్ ఇంజన్లను ఉపయోగించి మొక్కలకు నీరుపోయాలని, నీళ్లు లేక మొక్కలు ఎండిపోయాయనే పరిస్థితి తలెత్తవద్దని అన్నారు.