: రాజ్యసభకు వెళ్లనున్న సుజనా!... కొత్త సభ్యుడిగా మరికాసేపట్లో ప్రమాణం!
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి మరికాసేపట్లో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నారు. మొన్న జరిగిన కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి కాస్తంత ఆలస్యంగా వచ్చిన ఆయన ప్రమాణం చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం ప్రమాణం చేస్తానని ఆయన రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి సమాచారం ఇచ్చారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లు మరికాసేపట్లో రాజ్యసభలో ఓటింగ్ కు రానుంది. ఏపీ ప్రయోజనాల నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా కేవీపీ బిల్లుకు మద్దతు పలకాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో మరికాసేపట్లో ప్రారంభం కానున్న రాజ్యసభ సమావేశాలకు సుజనా చౌదరి హాజరుకాక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో సభకు రానున్న ఆయన తొలుత రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత ప్రైవేటు బిల్లుల చర్చల్లో పాలుపంచుకుంటారు.