: కాంగ్రెస్ ది కుటిల రాజకీయం!.. ఒకటో స్థానంలోని కేవీపీ బిల్లు 13వ స్థానంలోకి మారితే నోరెత్తలేదన్న సీఎం రమేశ్!


ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరు సాగిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆరోపించారు. ఏపీకి హోదా కోసం కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లు నేడు రాజ్యసభలో ఓటింగ్ కు రానున్న నేపథ్యంలో నేటి ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రమేశ్... ఓ సరికొత్త వాదనను వినిపించారు. పార్లమెంటు సభా వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశంలో భాగంగా జరిగిన చర్చను ఆయన బయటపెట్టారు. నేడు రాజ్యసభ ముందుకు రానున్న ప్రైవేటు బిల్లుల్లో కేవీపీ బిల్లు తొలి స్థానంలోనే ఉండగా, బీఏసీ సమావేశంలో దానిని 13వ స్థానానికి మార్చారని రమేశ్ చెప్పారు. ఈ సందర్భంగా బీఏసీ సమావేశంలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దీనికి ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఆయన మండిపడ్డారు. కేవీపీ బిల్లు ఓటింగ్ కు రాకూడదన్న భావనతో బీజేపీ బిల్లును ఒకటో స్థానం నుంచి 13 వ స్థానానికి మార్చితే... దానిని గమనించినా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేదని చెప్పారు. వెరసి కేవీపీ బిల్లు ఓటింగ్ కు రావడం కాంగ్రెస్ పార్టీకి కూడా ఇష్టం లేదనే భావించాల్సి ఉందని సీఎం రమేశ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News