: ఎడతెరిపిలేని వర్షం!... తెలుగు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తం!
మొన్న చినుకుగా మొదలై... నిన్న వర్షంగా మారి... నిన్న రాత్రి నుంచి భారీ వర్షంగా రూపాంతరం చెందిన వరుణదేవుడు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తాడు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలోని మెజారిటీ ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. వెరసి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నేటి ఉదయానికి కాస్తంత ప్రతాపం తగ్గించిన వరుణుడు చిరు జల్లులను కురిపిస్తూనే ఉన్నాడు. దీంతో నగరంలో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ఇక హైదరాబాదు పొరుగు జిల్లాలు రంగారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. ఆదిలాబాదు జిల్లాను వరుణుడు అతలాకుతలం చేశాడు. జిల్లాలో మెజారిటీ ప్రాంతాలు భారీ వర్షంతో తడిసిముద్దయ్యాయి. మరోవైపు ఏపీలోని చాలా జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.