: అంతటా ‘కబాలి’ ఫీవర్!...థియేటర్ల వద్ద టికెట్లు దొరక్క రజనీ అభిమానుల గగ్గోలు!
యావత్తు దేశాన్నే కాకుండా దాదాపుగా ప్రపంచాన్నే ‘కబాలి’ ఫీవర్ కమ్మేసింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ చిత్రం నేటి తెల్లవారుజాముననే ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. విశ్వవ్యాప్తంగా 3,900 ప్రింట్లతో రిలీజైన ఈ చిత్రం అమెరికాలో ఓ రోజు ముందుగా నిన్ననే ప్రేక్షకులకు కనువిందు చేసింది. అమెరికాలో చిత్రంపై వినిపించిన టాక్ తో దేశంలో ఈ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా నేడు ఈ చిత్రం విడుదలైంది. అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలతో ఆయా థియేటర్లలో సందడి మొదలైంది. తమిళనాడు రాజధాని చెన్నైలోనే 125 థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శితమవుతున్నా... చాలా థియేటర్ల వద్ద టికెట్లు దొరకక అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. థియేటర్ల యాజమాన్యాలు టికెట్లను కార్పొరేట్లకు భారీ ధరలకు అమ్ముకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. దీంతో పలుచోట్ల ‘కబాలి’ టికెట్ల కోసం స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇక దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.