: రాజకీయ పార్టీలకు అమరావతిలో భూముల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజకీయ పార్టీలకు స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పార్టీల స్థాయిని బట్టి ఈ కేటాయింపులు జరిపినట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల గుర్తింపు ప్రకారం స్థలాల కేటాయింపు పాలసీని ఖరారు చేసింది. శాసనసభలో 50 శాతం కంటే ఎక్కువ సీట్లు ఉన్న పార్టీలకు సీఆర్ డీఏ పరిధిలో 4 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 25 నుంచి 50 శాతం మధ్య సీట్లు ఉంటే అర ఎకరం స్థలం మాత్రమే కేటాయించడం విశేషం. అసెంబ్లీలో ఆ పార్టీకి కనీసం ఒక్క సభ్యుడైనా ఉంటే వెయ్యి గజాల స్థలం కేటాయించగా, జిల్లా కేంద్రాల్లో కూడా ఇదే పధ్ధతిలో పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించింది. మొదటి శ్రేణికి చెందిన పార్టీలకు జిల్లా కేంద్రాల్లో రెండెకరాలు కేటాయించగా, ద్వితీయ శ్రేణి పార్టీలకు వెయ్యి గజాల స్థలం కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మూడో శ్రేణి పార్టీలకు 300 గజాల కేటాయింపు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలకు స్థలాలు దక్కే అవకాశం లేదు. బీజేపీకి మాత్రం వెయ్యి గజాల స్థలం దక్కే అవకాశం ఉంది.