: మూడు నెలలు మాయమైపోయిన రఘువీరా! నీకు నైతిక హక్కు ఉందా?: నిమ్మల కిష్టప్ప
రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో మూడు నెలల పాటు కనపడకుండా పోయిన నువ్వా చంద్రబాబును విమర్శించేది? అని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డిపై టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే విభజన సమయంలో బిల్లులో రాష్ట్రానికి ఏం చేశారని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. 'విభజన జరుగుతుంటే మూడు నెలలపాటు దొంగలాగ దాక్కున్న నువ్వు ఇప్పుడు చిత్తశుద్ధి గురించి ప్రశ్నిస్తావా?' అని మండిపడ్డారు. విభజన సమయంలో సహేతుకమైన విభజన జరగాలంటూ చంద్రబాబు మమతా బెనర్జీ సహా ఎంతో మంది నేతలను కలిశారని ఆయన గర్తుచేశారు. అలాంటి చంద్రబాబును ప్రశ్నించే స్థాయి నీకుందా? అని అడిగారు. రాజకీయాల కోసం మళ్లీ నాటకాలు మొదలు పెడతావా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గురాలేదా? అని ఆయన నిలదీశారు.