: మన బిల్లు పాసయ్యేంత వరకు ఇతర ఏ బిల్లు పాస్ కానివ్వకుండా చూడండి: సీఎం రమేష్ సవాల్


కాంగ్రెస్ తీరు మనిషిని చంపేసి సంతాపసభ పెట్టినట్టుగా ఉందని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కోరుకుంటే... రాజ్యసభలో అధికారపార్టీ ప్రవేశపెట్టే ఏ బిల్లు కూడా పాస్ కాకుండా చూడాలని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నేతలకు సిగ్గురాలేదని అన్నారు. రాష్ట్రాన్ని తప్పుడు పద్ధతుల్లో, అడ్డగోలుగా విభజించి తీవ్ర తప్పిదం చేసిన కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం ప్రైవేటు బిల్లు అంటూ మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతెందుకు, ప్రైవేటు బిల్లు గురించి ఇంత హడావుడి చేస్తున్న కాంగ్రెస్ నేతలు రేపు ఓటింగ్ లో ఎంతమంది పాల్గొంటారో చూడాలని ఆయన సూచించారు. రఘువీరారెడ్డికి తెలుగు ప్రజలపై ఏమాత్రం ప్రేమున్నా... తెలుగు ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్న రాజ్యసభలో ఏ బిల్లు పాస్ కాకుండా చూడాలని సూచించారు. తెలుగు ప్రజలకు మేలు జరగాలంటే ముందు ఏపీకి ప్రత్యేకహోదా బిల్లు పాస్ అయిన తరువాతే ఇతర బిల్లులు పాస్ అయ్యేందుకు సహకరిస్తామని ప్రకటించమనండని ఆయన సవాలు విసిరారు. ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాడతామని కాంగ్రెస్ నేతలను పోడియంలో కూర్చోమనండి, వారితో కలిసి నడిచేందుకు తాము సిద్ధమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News