: చంద్రబాబు చేయరు, ఇంకొకరిని చేయనివ్వరు.. అదొక జబ్బు!: కేవీపీ బిల్లు నేపథ్యంలో రఘువీరా కామెంట్లు
వామపక్ష పార్టీలు, జేడీయూ, సమాజ్ వాదీ, డీఎంకే, టీఆర్ఎస్ పార్టీలన్నీ కేవీపీ ప్రత్యేక హోదా బిల్లుకి మద్దతు తెలిపాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈరోజు తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పార్టీల నుంచి బిల్లుకు మద్దతు లభించినా ఏపీ అధికార తెలుగు దేశం పార్టీ నుంచి ఇంతవరకు ప్రకటన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన వారు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ‘ఒకరు బిల్లుకి మద్దతిస్తామని చెబుతారు, మరొకరు బిల్లుతో ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా ప్రైవేటు బిల్లు ఆమోదం పొందదని వ్యాఖ్యలు చేశారని రఘువీరారెడ్డి అన్నారు. గతంలో 14 ప్రైవేటు బిల్లులు ఆమోదం పొందాయని, అవి చట్టాలుగా కూడా అయ్యాయని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా బిల్లుపై తనకు బాధ్యతే లేనట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రజాప్రయోజనాలను దక్కించుకునే క్రమంలో రెండేళ్లుగా ప్రధాన అడ్డంకిలా చంద్రబాబే మారారని, హోదా అంశంలో శకునిగా చంద్రబాబు అడ్డున్నారని ఆయన ఆరోపించారు. ‘అది అతని జబ్బు.. అతను చేయడు.. ఇతరులు చేస్తే ఓర్చుకోరు’ అని చంద్రబాబుని రఘువీరా విమర్శించారు. ‘రేవంత్ రెడ్డికి చంద్రబాబు సెక్యూరిటీ ఇవ్వమని కేంద్రానికి లెటర్ రాశారు. మరి ముఖ్యమంత్రిగా ప్రత్యేక హోదా కోసం మాట్లాడాల్సిన అవసరం మీకు లేదా?’ అని ఆయన ప్రశ్నించారు. రేపు బిల్లుకి సహకరించకపోతే బీజేపీ, టీడీపీ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని, మొదటి ముద్దాయి చంద్రబాబే అవుతారని ఆయన అన్నారు.