: ఇక ఈ అంశంపై బీఎస్పీ రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు: వెంకయ్యనాయుడు
బీఎస్పీ అధినేత మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దయాశంకర్ సింగ్ ను పార్టీ నుంచి వెలివేశామని, అయినప్పటికీ, ఈ అంశంపై రాద్ధాంతం చేయడం తగదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుడూ, అనుచిత వ్యాఖ్యలు చేసిన తమ నేతపై తాము చర్యలు తీసుకున్నప్పటికీ, ఈరోజు లక్నోలో బీఎస్పీ నేతలు ఆందోళన చేపట్టడం అర్థరహితమని, ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ విషయం ముగిసిందని, ఆ నేతపై చర్యలు తీసుకున్నామని, అంతకన్నా ఏం చేయగలమంటూ వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. పార్లమెంట్ లో ఏమైనా జరిగితే అక్కడే చర్యలు తీసుకునేవాళ్లమని, సభ వెలుపల ఆ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే సభలో తమ నేత ఖండించారని అన్నారు. ఆ నేతను పదవి నుంచి తప్పించాం, ఆ తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆందోళనలు చేస్తూనే ఉంటాయని, ఎందుకంటే, బీజేపీ ముందుకు దూసుకుపోవడాన్ని వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి బీజేపీయేనని అందుకే బీఎస్పీ భయపడుతోందన్నారు. ఈ నేపథ్యంలోనే అనుచిత వ్యాఖ్యల అంశాన్ని సాకుగా చూపిస్తూ బీజేపీపై తప్పుడు ప్రచారానికి బీఎస్పీ పాల్పడుతోందని వెంకయ్యనాయుడు ఆరోపించారు.