: కోమటిరెడ్డి వద్ద అప్రకటిత ఆస్తులు?... జల్లెడ పడుతున్న 25 ఐటీ బృందాలు!
టీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద అప్రకటిత ఆస్తులు ఉన్నాయా? అంటే... అవుననే అంటున్నాయి ఆదాయపన్ను శాఖ వర్గాలు. విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ఐటీ శాఖ నేటి ఉదయం 25 బృందాలతో కోమటిరెడ్డి కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేసింది. ప్రస్తుతం రాజకీయ నేతగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ అంతకుముందే వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టారు. సోదరుడు రాజగోపాల్ రెడ్డితో కలిసి వ్యాపారాలు చేస్తున్న కోమటిరెడ్డి... ఇన్ ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తూ ఆస్తులు కూడబెట్టుకుంటూ, వాటికి సంబంధించి పన్నులను ప్రభుత్వానికి చెల్లించకుండా ఉండేందుకే వాటిని దాచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేటి ఉదయం విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఆదాయపన్ను శాఖ కోమటిరెడ్డి కార్యాలయాలపై పంజా విసిరింది. ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్న ఈ దాడుల్లో కోమటిరెడ్డికి సంబంధించి ఎంతమేర అప్రకటిత ఆస్తులు బయటపడతాయో చూడాలి.