: శేషాచలం కొండల్లో తుపాకుల గర్జన!... ‘ఎర్ర’ స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్ కు గాయాలు!
చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం కొండల్లో మరోమారు తుపాకుల గర్జన వినిపించింది. ఎర్రచందనం చెట్లను నరికేందుకు వచ్చిన కూలీలు... కూంబింగ్ చేస్తున్న టాస్క్ ఫోర్స్ బృందంపై రాళ్ల దాడికి దిగారు. జిల్లాలోని పుట్టగడ్డ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో టాస్క్ ఫోర్స్ కు చెందిన కానిస్టేబుల్ దిలీప్ కుమార్ కు గాయాలయ్యాయి. ఎర్రచందనం కూలీల దుశ్చర్యపై వేగంగా స్పందించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో బెదిరిపోయిన కూలీలు పరారయ్యారు. ఈ క్రమంలో వారిని వెంబడించిన పోలీసులు 20 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కూలీల రాళ్ల దాడిలో గాయపడ్డ దిలీప్ కుమార్ ను హుటాహుటిన తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు,