: సల్మాన్ పై రజనీకాంత్ పంచ్... సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న జోక్!


సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే అభిమానులకు ఎంత పిచ్చో ఇవాళ, రేపు సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ లను ఓ మారు తిరగేస్తే సరిపోతుంది. 'కబాలి' కన్నా రెండు వారాల ముందు సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్' చిత్రం రంజాన్ పండగ నాడు విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్ల దిశగా సాగుతుండగా, ఆ వసూళ్లకు రెండు రోజుల్లో బ్రేక్ పడనుంది. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాలు సహా, దేశవ్యాప్తంగా దాదాపు 600 థియేటర్ల నుంచి ఆ చిత్రాన్ని తొలగిస్తున్నారు కాబట్టి. కారణం... సూపర్ స్టార్ రజనీ చిత్రం 'కబాలి' వస్తుండటమే! ఇక సుల్తాన్ కు, 'కబాలి'కి ఇదే వ్యత్యాసమంటూ సామాజిక మాధ్యమాల్లో ఎవరో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. "ఈద్ రోజు సెలవు కాబట్టి సుల్తాన్ రిలీజ్ చేశా" అని సల్మాన్ అంటుంటే, "నా సినిమా రిలీజైన రోజే సెలవు" అని రజనీకాంత్ చెబుతున్నట్టుగా ఈ పోస్ట్ ఉంటుంది. కబాలి చిత్రాన్ని చూసేందుకు ఉద్యోగులంతా ఒక్కసారిగా సిక్ లీవులు తీసుకోవచ్చని భావించిన కొన్ని ఐటీ కంపెనీలు ముందుగానే తమ ఆఫీసులకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. దక్షిణాది వ్యాప్తంగా కబాలి ఫీవర్ ఎలా ఉందో చెప్పకనే చెబుతోందీ పోస్టు.

  • Loading...

More Telugu News