: షాకింగ్ స్టేట్మెంట్... 'కొందరిని దెయ్యాలే చంపాయంటూ' మధ్యప్రదేశ్ హోంమంత్రి అధికారిక ప్రకటన!
మధ్యప్రదేశ్‌లో నమోదవుతోన్న మరణాలపై ఆ రాష్ట్ర అధికార భారతీయ జనతా పార్టీని సమాధానం చెప్పాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ శాసనసభలో డిమాండ్ చేసింది. అయితే, దానిపై స్పందించిన ఆ రాష్ట్ర హోం మంత్రి భూపేంద్రసింగ్ మతిపోగొట్టే సమాధానం ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో గత రెండున్నరేళ్లలో 400 మంది మృతి చెందారని, వారిలో కొందరిని దెయ్యాలు చంపాయని ఆయన అధికారికంగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన విన్న వారికి మతిపోయేంత పనైంది. దీనిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేంద్ర పటేల్ స్పందిస్తూ హోం మంత్రి ప్రకటన తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. కొందరి చావులకి కారణం చేతబడి, దెయ్యాలే కారణమని సాక్షాత్తు హోంమంత్రే ప్రకటన చేయడం నవ్వుపుట్టించే విధంగా ఉందని ఆయన అన్నారు. హోం మంత్రి ఈ ప్రకటన చేసిన తరువాత తాము ప్రభుత్వం మూఢనమ్మకాలను విశ్వసిస్తుందా? అని ప్రశ్నించామని, దీనికి మంత్రి నుంచి సమాధానం రాలేదని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటన చేసిన తరువాత భూపేంద్రసింగ్ శాసనసభ బయట మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబ సభ్యులు దెయ్యాల వల్లే చనిపోయారని చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు స్టేట్‌మెంట్ ఇచ్చారని, అదే విషయాన్ని తాము ప్రకటించామని చెప్పుకొచ్చారు. అయితే సర్కారు ఇటువంటి వాటిని విశ్వసించబోదని ఆయన అన్నారు.