: పంజాబ్ లో అకాలీదళ్ కు ఎదురుదెబ్బ!... ఆప్ లో చేరికకు హాకీ మాజీ కెప్టెన్ సన్నాహాలు!
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు సంబంధించిన వేడి అప్పుడే రాజుకుంది. ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ శిరోమణి అకాలీదళ్ బహిష్కరించిన జలంధర్ ఎమ్మెల్యే, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ పర్గత్ సింగ్... ఆమ్ ఆద్మీ పార్టీ దరికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. జలంధర్ పరిధిలోని జంషేర్ లో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టుపై ఆ ప్రాంత ప్రజల తరఫున పర్గత్ సింగ్ నిరసన గళం విప్పారు. దీంతో సొంత పార్టీ ప్రభుత్వంపైనే నిరసన గళం విప్పుతారా? అంటూ పర్గత్ సింగ్ తో పాటు మరో ఎమ్మెల్యే ఇందర్ బీర్ సింగ్ భోలారియాను అకాలీదళ్ బహిష్కరణ వేటు వేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పర్గత్ సింగ్... ప్రజల వాణి వినిపించడమే తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. పార్టీ సస్పెన్షన్ పై తానేమీ బాధ పడటం లేదని, ప్రజల పక్షాన పోరుకే తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా బీజేపీ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ బాటలోనే పర్గత్ సింగ్ కూడా ఆప్ లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఇద్దరు ప్రముఖ క్రీడాకారుల దెబ్బలతో అటు బీజేపీతో పాటు ఇటు అకాలీదళ్ లు కూడా భారీ మూల్యాన్నే చెల్లించుకోక తప్పదన్న వాదన వినిపిస్తోంది.