: ఆంధ్రాలో ఉండబోము, తెలంగాణకు పోతామంటున్న ఇద్దరు ఐపీఎస్ అధికారులు
ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు, తాము ఆంధ్రప్రదేశ్ లో ఉండబోమని, తెలంగాణకు కేటాయించాలని కోరుతూ క్యాట్ (కామన్ అపిలేట్ ట్రైబ్యునల్) లో పిటిషన్ దాఖలు చేశారు. ఐపీఎస్ ఆఫీసర్లు అమిత్ గార్గ్, హరీశ్ కుమార్ గుప్తాలు దాఖలు చేసిన ఈ పిటిషన్ ను క్యాట్ విచారణకు స్వీకరించింది. ఆపై కేంద్రం, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపుతూ సమాధానం ఇవ్వాలని కోరింది. విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. కాగా, ఆంధ్రాను వీరు ఎందుకు వద్దన్నారన్న విషయంపై సమాచారం ఇంకా అందలేదు. అమిత్ గార్గ్ మాత్రం గతంలోనే తాను తెలంగాణలో ఉంటానని, ఏపీకి వెళ్లనని చెప్పినప్పటికీ, అధికారుల విభజనలో భాగంగా ఆయన్ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన సంగతి తెలిసిందే.