: మా వల్ల కాదు బాబోయ్!... అత్యవసర కేసులను పంపొద్దంటూ 'స్విమ్స్' సర్క్యులర్!
తిరుమల వెంకన్న పాదాల చెంత తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) పేరిట ఏర్పాటైన సర్కారీ ఆసుపత్రి సేవల్లో అగ్రగామిగానే నిలుస్తోంది. హైదరాబాదులోని నిజామ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) స్థాయిలో కాకున్నా... తెలుగు నేలలోని సర్కారీ ఆసుపత్రులతో పోలిస్తే రాయలసీమకే తలమానికంగా నిలుస్తున్న స్విమ్స్ మెరుగైన ఆసుపత్రి కిందే లెక్క. అలాంటి ఆసుపత్రి ఇటీవల జారీ చేసిన ఓ సర్క్యులర్ కలకలం రేపుతోంది. అత్యవసర చికిత్సలకు సేవలందించలేమని స్విమ్స్ యాజమాన్యం చేతులెత్తేసింది. అంతటితో ఆగని ఆ ఆసుపత్రి చిత్తూరు, కడప జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు ఓ సర్క్యులర్ జారీ చేసింది. అత్యవసర చికిత్స అవసరమైన రోగులను తమ వద్దకు పంపవద్దని అందులో స్విమ్స్ పేర్కొంది. దీనిపై అటు వైద్య వర్గాల్లోనే కాకుండా జనంలోనూ ఆగ్రహం పెల్లుబుకుతోంది.