: అమరావతికి అబుదాబి కుబేరుడి దన్ను!... మార్కెటింగ్ పర్సన్ గా పనిచేస్తానంటున్న బీఆర్ శెట్టి!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి దన్నుగా నిలబడనున్నట్లు అబుదాబిలోని ఎన్నారై కుబేరుడు బీఆర్ శెట్టి ప్రకటించారు. అమరావతి పరిధిలో రూ.12,600 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే విషయానికి సంబంధించి ఆయన మొన్న ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం ఆయన విజయవాడ నుంచి తిరిగివెళుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అబుదాబి నగరాభివృద్ధిలో కీలక భూమిక పోషించిన తాను ప్రస్తుతం అమరావతి అభివృద్ధికి కృషి చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా తాను అమరావతికి మార్కెటింగ్ పర్సన్ లా వ్యవహరిస్తానని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అమరావతిలో పెట్టుబడులు పెట్టేలా ఆయా దేశాల వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తానని తెలిపారు. అమరావతిలో ఉన్న అపార అవకాశాలపై వారికి సవివరంగా చెబుతానని ఆయన పేర్కొన్నారు.