: ప్రజా సాధికార సర్వే 'కొంపముంచేదే' అంటూ టీడీపీ నేతల గగ్గోలు!
ప్రజా సాధికార సర్వే పేరిట ప్రజల నుంచి సేకరిస్తున్న వివరాల ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయండి... బొబ్బిలి టీడీపీ సమన్వయ కమిటీ చేసిన తీర్మానమిది. ఒక్క బొబ్బిలిలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, ఈ సర్వేపై తెలుగుదేశం కింది స్థాయి నేతలంతా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. సర్వే పేరిట 88 రకాల వివరాలను అధికారులు అడుగుతుండటం, వాటిల్లో బ్యాంకు పాస్ పుస్తకాల వివరాల నుంచి, గ్యాస్, రేషన్ కనెక్షన్లు, వాహనాలు, పాత కరెంటు బిల్లులు, ఆధార్, పాన్ కార్డు వివరాలు, ఇంటి వైశాల్యం, గతంలో తీసుకున్న రుణాలు, ఇప్పుడు కడుతున్న కిస్తీలు, ఎంత పొలం, దానిలో వేస్తున్న పంట తదితర వివరాలనెన్నింటినో అడుగుతున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. స్వయంగా తెలుగుదేశం పార్టీ వారే సర్వేలో పాల్గొని వివరాలు అందించేందుకు అంగీకరించడం లేదు. సర్వేపై ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయని, దీంతో పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. ఈ సర్వేతో తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగేలా ఉందని అభిప్రాయపడుతున్నారు. సర్వేలో వివరాలు అందిస్తే, సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు కట్ చేస్తారని పేద వర్గాలు భయపడుతుంటే, తమ గ్యాస్ సబ్సిడీ వంటివి తొలగిస్తారేమోనని మధ్య తరగతి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.