: తప్పిన ముప్పు.. బయల్దేరిన కొద్ది సేపటికే విమానాన్ని కిందకు దింపిన పైలట్
పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎయిర్ ఇండియా విమానం ఈరోజు ప్రమాదం నుంచి బయటపడింది. పశ్చిమబెంగాల్ కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్ పోర్టు నుంచి ఈరోజు ఉదయం 8.18 గంటలకు ఖాట్మాండు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. విషయాన్ని గమనించిన పైలట్ కొన్ని నిమిషాలకే విమానాన్ని కిందకు దింపాడు. విమానంలో 56 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వీరందరూ క్షేమంగా బయటపడ్డారని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులందరినీ మరో విమానంలో ఖాట్మాండుకి పంపినట్లు తెలిపారు. మరోవైపు ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిచేస్తున్నట్లు వారు తెలిపారు.