: టీడీపీ, బీజేపీ నేతల మధ్య రణరంగం!... గుంటూరులో హైటెన్షన్!
గుంటూరు అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవి... ఏపీలోని అధికార మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీల మధ్య మరోమారు చిచ్చు రాజేసింది. ఇప్పటికే పలు విషయాల్లో వాదనలకు దిగిన ఈ రెండు పార్టీలు గుంటూరు అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవి కోసం తాజాగా వాదులాటకు దిగాయి. నేటి ఉదయం నగరంలోని బ్యాంకు కార్యాలయం వద్దకు ఇరు పార్టీల నేతలు వేర్వేరుగా చేరుకున్నారు. చైర్మన్ పదవి కోసం ఇరు పార్టీలు వేర్వేరుగా నామినేషన్ల దాఖలుకు సిద్ధపడ్డాయి. ఈ సందర్భంగా అక్కడ ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్న రెండు పార్టీల నేతలు ఆ తర్వాత ఒకరినొకరు తోసుకున్నారు. వెరసి రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.