: ‘వరల్డ్ టాప్ 10 క్రిమినల్స్’లో నరేంద్ర మోదీ!... సెర్చింజన్ గూగుల్ కు కోర్టు నోటీసులు!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సెర్చింజన్ జెయింట్ గూగుల్ అవమానపరిచింది. ప్రపంచంలోని టాప్ టెన్ నేరగాళ్లలో ఆయన ఒకరని పేర్కొంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. దీంతో గూగుల్ తో పాటు ఆ సంస్థ సీఈఓ, ఇండియా హెడ్ లకు నోటీసులు జారీ చేసిన అలహాబాదు కోర్టు... వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకెళితే... వరల్డ్ టాప్ టెన్ క్రిమినల్స్ జాబితా ఇదేనంటూ ప్రకటించిన గూగుల్... అందులో మోదీ పేరును ఉంచింది. దీనిని గమనించిన అలహాబాదు న్యాయవాది సుశీల్ కుమార్... ఆ జాబితా నుంచి మోదీ పేరును తీసేయాలని కోరారు. అయితే గూగుల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సుశీల్ కుమార్ అలహాబాదు చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సీజేఎం కోర్టు గతేడాది నవంబర్ 3న సదరు పిటిషన్ ను కొట్టివేసింది. సీజేఎం కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుశీల్ కుమార్ అలహాబాదులోని మరో కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న విచారణ చేపట్టిన కోర్టు... గూగుల్, దాని సీఈఓ, ఇండియా హెడ్ లకు నోటీసులు జారీ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించింది.