: మోదీ సూచనను పాటించిన కేసీఆర్!... ఢిల్లీలో రెండు రోజుల రెస్ట్ లో టీఎస్ సీఎం!


'మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే రెస్ట్ తీసుకోండి' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనను టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాటించారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశం కోసం గత వారం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఆ సమావేశంలో ఉండగానే అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరం కారణంగా సమావేశం మధ్యలో నుంచే ఆయన బయటకు వచ్చేశారు. మొన్న తనను కలిసిన కేసీఆర్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచిన ప్రధాని మోదీ... రెండు రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ప్రధాని సూచన మేరకు నిన్న మొత్తం రెస్ట్ తీసుకున్న కేసీఆర్... నేడు కూడా అక్కడే విశ్రమించనున్నారు. ఢిల్లీలో తన అధికారిక నివాస్ 23, తుగ్లక్ రోడ్డు బంగ్లాలోనే నిన్నంతా గడిపిన కేసీఆర్... పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలను మాత్రమే లోపలికి అనుమతించారు. మిగిలిన ఏ ఒక్కరికి కూడా కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఇక నేడు పగలల్లా అక్కడే విశ్రాంతి తీసుకోనున్న కేసీఆర్... నేటి రాత్రికి హైదరాబాదు బయలుదేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News