: లైంగికంగా వాడుకుని, నా చేత ఆర్థిక నేరాలు చేయించారు: మలయాళ సినీ నటి సరితా నాయర్
కేరళలో కలకలం రేపిన సోలార్ కుంభకోణంలో తనను లైంగికంగా వాడుకుని, తన చేత ఆర్థిక నేరాలు చేయించారని సినీ నటి సరితా నాయర్ ఆరోపించింది. చీటింగ్ కేసులో విచారణ సందర్భంగా కోయంబత్తూరు న్యాయస్థానంలో హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీతో పాటు ఒక మంత్రి, మరో ముగ్గురు తనను లైంగికంగా వాడుకున్నారని తెలిపారు. కేరళ మాజీ ఆర్థిక మంత్రి పళని మాణిక్యం ఓ ఐటీ కేసునకు సంబంధించి కోటి లంచం డిమాండ్ చేయగా అడ్వాన్స్ గా 25 లక్షలు ఇచ్చానని అన్నారు. లంచం తీసుకున్న తర్వాత ఆ మంత్రి తనను లైంగికంగా వేధించారన్నారు. కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీతో పాటు నలుగురు తనను లైంగికంగా దోపిడీ చేయడమే గాక తనతో ఆర్థిక నేరాలు చేయించారని ఆమె ఆరోపించారు. సుమారు 70 కోట్ల సోలార్ కుంభకోణానికి సంబంధించి 13 మంది రాజకీయ నేతలపై ఫిర్యాదు చేసినట్లు ఆమె వివరించారు. ఈ వ్యవహారం మొత్తంపై ఆటోబయోగ్రఫీ రాయడంతో పాటు మలయాళం, తమిళంలో సినిమాలు తీస్తున్నానని ఆమె వెల్లడించారు.